Saturday, May 2, 2015

లోక్ సత్తా పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడిగా డా.పాండురంగారావు, ప్రధాన కార్యదర్శిగా సోల్కర్ రెడ్డి

విద్యావేత్త, పార్టీ సీనియర్ నాయకుడు తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. ఎం.పాండురంగారావును లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, యువసత్తా రాష్ట్ర అధ్యక్షుడు కె.సోల్కర్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సీనియర్ నాయకుడు డా. పసల భాస్కర్ రావును కోశాధికారిగా నియమించినట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి హైమ పోతినేని ఒక ప్రకటనలో తెలిపారు.

డా. పాండురంగారావు హార్వార్డ్ (అమెరికా) మరియు యు.కె.లలో చదువును అభ్యసించారు. 2008 నుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. 2009 లో మలక్ పేట్ నియోజకవర్గం నుండి లోక్ సత్తా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.

ఎం.సి.ఏ. పట్టభద్రుడైన సోల్కర్ రెడ్డి వ్యవసాయ కుటుంబంలో 1981లో పుట్టారు. 2002 నుండి పార్టీలో పని చేస్తున్నారు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి లోక్ సత్తా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంఛార్జ్ గా గత పదేళ్ళ నుండి పార్టీకి సేవలందిస్తున్నారు. యువసత్తా రాష్ట్ర అధ్యక్షుడుగా 2014 లో నియమితులయ్యారు.

మాజీ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగి అయిన డా. పసల భాస్కర్ రావు పార్టీలో సీనియర్ నాయకుడు. రైతుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన భాస్కర్ రావు లోక్ సత్తా పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి ఎనలేని సేవలందిస్తున్నారు. భాస్కర్ రావు లోక్ సత్తా పార్టీ ట్రైనింగ్ సెంటర్ కు డైరక్టర్ గా, పార్టీ జాతీయ కోశాధికారిగా, తెలంగాణా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 2010 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొత్తపేట నుండి కార్పొరేటర్ గా పోటీచేశారు.

త్వరలో లోక్ సత్తా పార్టీ తెలంగాణాలో వివిధ కమిటీలకు అధ్యక్షులను, ఆఫీసు బేరర్లను, గ్రేటర్ హైదరాబాద్ కు నూతన కార్యవర్గ కమిటీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా హైమ పోతినేని తెలిపారు.

1 comment:

  1. వీళ్ళు ఎక్కడ చదివారు లేదా పోటీ చేసారు అనవసరం. వీళ్ళు తెలంగాణా రాష్ట్ర అవతరణ ఉద్యమంలో ఏమన్నా చేసారా అనేది చెప్పండి.

    ReplyDelete